: చంద్రబాబు తెలంగాణ యాత్ర ఖరారు... 12న వరంగల్ కు ఏపీ సీఎం
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణ యాత్ర దాదాపుగా ఖరారైంది. ఈ నెల 12న ఆయన వరంగల్ వెళ్లనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆయన జరపనున్న తొలి యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తుంటే, తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు తెలంగాణలో ఎలా పర్యటిస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ సైకిల్, బైక్ ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ కార్యకర్తలు యోచిస్తున్నారు. ఒక్క వరంగల్ పర్యటనతోనే యాత్రను ముగించకుండా మిగిలిన ప్రాంతాల్లోనూ యాత్రను కొనసాగించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. మరోవైపు చంద్రబాబు యాత్రపై టీఆర్ఎస్ లో అప్పుడే కలవరం మొదలైంది. చంద్రబాబు యాత్రను నిలువరించడమెలా? అన్న విషయంపై ఆ పార్టీ నేతలు ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.