: ఆర్థిక సాయం కోసం కేంద్రం వద్దకు కేసీఆర్... నేడు ఢిల్లీకి, నాలుగు రోజులు అక్కడే!


కొత్త రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు పథకాల కొనసాగింపునకు అవసరమైన నిధులను మంజూరు చేయించుకోవాలన్న ప్రధాన లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరనున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న కేసీఆర్, పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్నారు. కేంద్ర సాయం లేకుండా సంక్షేమ పథకాల కొనసాగింపు దుర్లభమేనన్న విషయాన్ని ఆయన కేంద్ర మంత్రులకు అర్థమయ్యేలా చెప్పేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇక రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని కేంద్రం ముందు పెట్టడంతో పాటు అదనపు విద్యుత్ కేటాయింపుపై హామీ లభించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పైలాన్ ప్రారంభోత్సవానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన పలు విద్యా సంస్థల ఏర్పాటు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితరాలపై కూడా కేసీఆర్ దృష్టి సారించనున్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ తొలి సమావేశానికి కూడా కేసీఆర్ హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News