: లోక్ సత్తాలో ముదిరిన విభేదాలు... జేపీ మాట వినబోమన్న కటారి శ్రీనివాస్
రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామంటూ రంగంలోకి దిగిన లోక్ సత్తా, ఎన్నికల్లో ఆశించిన మేర ఫలితాలను సాధించడంలో చతికిలబడింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి దూకిన జయప్రకాశ్ నారాయణ మొన్నటి ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు. దీంతో ఆ పార్టీ దాదాపు కనుమరుగైనట్టేనని విశ్లేషకులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే, తాజాగా పార్టీలో విభేదాలు పొడచూపాయి. పార్టీ వ్యవస్థాపకుడు జేపీపై పార్టీ కీలక నేత కటారి శ్రీనివాస్ నిరసన గళం వినిపించారు. పార్టీ ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఏపీ అధ్యక్షుడు వర్మతో కలిసి నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడారు. పార్టీ అంతర్గత ఎన్నికల ద్వారా గెలిచిన వారి నాయకత్వాన్నే తాము అంగీకరిస్తామని చెప్పిన ఆయన, ఈ విషయంలో జేపీ మాట కూడా వినేది లేదని ప్రకటించారు. అసలు తమకు జాతీయ నాయకత్వమే లేదని కూడా ఆయన చెప్పారు.