: క్లాసిఫైడ్ లో యాడ్ తో మాయగాడి ‘కాస్ట్ లీ’ మోసం!
విలాసవంతమైన స్కోడా కారులో తిరుగుతూ, ఓ రాజకీయ నేతకు సెక్రటరీనని చెప్పుకున్న ఓ యువకుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. మెడికల్ సీట్లిప్పిస్తానని ఆ యువకుడు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు చెందిన పలువురిని బోల్తా కొట్టించి రూ. 4 కోట్లు వసూలు చేశాడు. అయితే, ఎట్టకేలకు పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కెళ్లాడు. వివరాల్లోకెళితే... మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ కు చెందిన మ్యాడబోయిన శ్రీనివాస్, ఓ స్కోడా కారును కొనుగోలు చేసి, దానిపై ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి సెక్రటరీనంటూ పేరు రాయించుకున్నాడు. మెడికల్ సీటు కోసం యత్నించి విఫలమైన వారిని గుర్తించి, వారిపై వల విసిరేవాడు. ఇందుకోసం అతడు అతి తక్కువ ఖర్చయ్యే క్లాసిఫైడ్ యాడ్స్ ను ఎంచుకున్నాడు. క్లాసిఫైడ్ యాడ్స్ ను చూసి తనకు ఫోన్ చేసేవారిని మాయమాటలతో రంగంలోకి లాగాడు. ఇలా తన సొంతరాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లోనూ చక్రం తిప్పాడు. రూ.4 కోట్ల మేర వసూలు చేశాడు. అయితే, ఇతడి చేతిలో మోసపోయిన అతడి సొంత రాష్ట్రవాసి చేసిన ఫిర్యాదుతో పట్టుబడిపోయాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన మధుసూదన్, తన కొడుకు మెడికల్ సీటు కోసం శ్రీనివాస్ కు అక్షరాల రూ.24 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే, రోజులు గడిచినా సీటు రాకపోవడంతో జమ్మికుంట పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.