: నిరుద్యోగులకు శుభవార్త... కేంద్ర బలగాల్లో భారీ నియామకాలు
కేంద్ర పారామిలటరీ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్ తదితర పోలీసు విభాగాల్లో భారీస్థాయిలో నియామకాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 62 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. నియామకాల్లో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లతో పాటు 2002 గుజరాత్ అల్లర్లు, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల పిల్లలు, వారిపై ఆధారపడిన వారికి వయోపరిమితిలో సడలింపు ఇవ్వనున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈ నియామకాలు అక్టోబర్ నాటికి పూర్తికానున్నాయి. 2016 జనవరి నుంచి శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, మొత్తం ఉద్యోగాల్లో 16 శాతం మహిళా అభ్యర్థులకు రిజర్వు చేశారు. దేశంలో అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్పీఎఫ్ లో అత్యధికంగా 24,588, బీఎస్ఎఫ్లో 22,517, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో 5,000, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ)లో 3,101, అస్సాం రైఫిల్స్‌లో 600, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్)లో 274, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో 86 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్టు వివరించారు.