: దుర్గమ్మ కొండపై పెళ్లి ‘సందడి’పై ఆంక్షలు... రెండు నెలల వరకు తప్పవట!


బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే పెళ్లిళ్లలో ఇకపై మేళతాళాలు, అనవసర హంగామా చెల్లవట. పెళ్లిళ్ల పేరిట వధూవరుల కుటుంబాలు చేస్తున్న సందడి... ఆలయానికి వస్తున్న భక్తులకు ఇబ్బంది కలిగిస్తోందట. దీంతో పెళ్లి ‘సందడి’పై ఆలయం ఆంక్షలు విధించింది. వివరాల్లోకెళితే... కనకదుర్గమ్మ సన్నిధిలో పెళ్లికి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే అందుకనుగుణంగా ఆలయంలో విస్తరణ పనులు జరగడం లేదు. దీంతో కొంతకాలంగా క్రమంగా పెరుగుతున్న వివాహాలతో ఆలయంలో శబ్ద కాలుష్యం నెలకొంటోందని కొందరు భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే దుర్గమ్మ చెంత జరిగే పెళ్లి వేడుకలకు నిరాకరణ కుదరని పని. మరి, అటు పెళ్లిళ్లతో పాటు భక్తులకూ ఇబ్బంది లేకుండా చేసేదెలా, అంటూ యోచించిన అధికారులు... పెళ్లిళ్లలో ‘సందడి’ని నివారిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా ఆలోచన చేశారు. దీనిపై అటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లి వేడుకల్లో సందడి లేకపోతే ఎలాగంటూ కాస్త డీలా పడుతున్న వివాహ బృందాలు, భక్తుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సర్దుకుపోతున్నారట. ఇదిలా ఉంటే, వివాహాల కోసం ఆలయ పరిధిలో కొత్తగా ఓ మండపం నిర్మితమవుతోంది. ఈ మండపం మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. మండపం పూర్తయ్యే దాకా ఆలయంలో పెళ్లి ‘సందడి’పై ఆంక్షలు తప్పవని ఆలయ అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News