: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో తెలుగు నేతల జోరు... బీజేపీ కీలక ప్రచారకర్తలు మనోళ్లే!
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. త్రిముఖ పోరులో కాంగ్రెస్ కాస్త వెనుకబడ్డా... బీజేపీ, ఆప్ లు మాత్రం నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడుతున్నాయి. విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్న బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో తెలుగు నేతలు కీలక భూమిక పోషిస్తున్నారు. ఢిల్లీపై ఉత్తరాది వారి కంటే తెలుగు నేత వెంకయ్యనాయుడికే మెరుగైన అవగాహన ఉందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంకయ్యనాయుడితో పాటు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆ పార్టీ ప్రచారంలో కీలక భూమిక పోషిస్తున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు రోజూ సంధిస్తున్న 5 సవాళ్లను నిర్మలా సీతారామన్ వెలువరిస్తుండగా, ప్రచార వ్యూహాల్లో వెంకయ్య కీలకంగా వ్యవహరిస్తున్నారు.