: బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పుడు... 30 వేల ఎకరాలు ఎందుకు?: మాజీ ఐఏఎస్ శర్మ
బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తే రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఎందుకని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రశ్నించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 3 వేల ఎకరాలు చేతులు మారాయని అన్నారు. ఇందులో భాగంగా 4 వేల కోట్ల ఆదాయం కొంత మంది ధనికుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. ఇది కేంద్ర ఆదాయపన్ను శాఖ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ మొత్తం దేశం దాటి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జేఎన్ఎన్ యూఆర్ఎం ప్రణాళికలో భాగంగా నగరాభివృద్ధిలో 25 శాతం పేదల ఇళ్లకు కేటాయించాలని నిబంధనలు చూపిస్తుండగా, సీఆర్డీఏ ప్రకారం కేవలం 5 శాతం భూములను మాత్రమే పేదల ఇళ్లకు కేటాయించనున్నారని ఆయన తెలిపారు. స్మార్ట్ సిటీలని ప్రచారం చేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మురికి వాడలను పెంచే ప్రణాళికలు రచిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర భూసేకరణ చట్టం ద్వారా కలిగిన హక్కులను ల్యాండ్ పూలింగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని ఆయన మండిపడ్డారు.