: కేసీఆర్ ది సింగిల్ దుకాణం అంటోన్న వీహెచ్


తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు పలు విమర్శలు చేశారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చేవారిని అడ్డం పెట్టుకుని పబ్బం గడపుకోవడం కేసీఆర్ కు అలవాటే అని దుయ్యబట్టారు. ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్ ది సింగిల్ దుకాణం.. సింగిల్ పార్టీ' అంటూ వ్యాఖ్యానించారు. ఎవరు వచ్చినా కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానిస్తాడని, ఆఖరికి 'మీరు వచ్చినా రండిరండంటూ' స్వాగతం చెబుతాడని విలేకరులనుద్ధేశించి వ్యాఖ్యానించేసరికి మీడియా సమావేశంలో నవ్వులు విరబూశాయి.

ఇక సీనియర్ నేత కె.కేశవరావు తెలంగాణ విషయంలో అతిగా స్పందించడం వల్లే ఆయన పదవి ఊడిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో ఇంకెన్నాళ్ళు ప్రజలను మభ్యపెడతారని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. రోజురోజుకు ఆత్మ హత్యలు ఎక్కువవుతున్నాయని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారంటూ కథనాలు వస్తుండడం పట్ల వీహెచ్ స్పందించారు. 99 శాతం ఎవరూ పార్టీని వీడరని చెప్పుకొచ్చారు. పార్టీలో ఉండే తెలంగాణ సాధించాలని సూచించారు.

  • Loading...

More Telugu News