: కృష్ణా కరకట్ట మీద అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?: సీపీఎం రాఘవులు
కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ను సీపీఎం మరింత తీవ్రతరం చేసింది. ఈరోజు విజయవాడలో కరకట్ట వద్ద నిర్మాణాలను ఆ పార్టీ పోలిట్ బ్యూరో సబ్యుడు రాఘవులు పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే అక్రమ కట్టడాలను పరిశీలించాలని కోరారు. అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతవారైనా శిక్షించాల్సిందేనన్నారు. రైతులకు ఓ న్యాయం, బడాబాబులకు మరో న్యాయమా? అని రాఘవులు ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమన్న ఏపీ ప్రభుత్వం... బీజేపీ కార్యాలయానికి ఎలా అనుమతిచ్చిందని సూటిగా అడిగారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.