: కొత్తగూడెంలో విషాదం... ఇంటి పైకప్పు కూలి మహిళ, ఇద్దరు చిన్నారులు మృతి
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అర్ధరాత్రి దాటిన తర్వాత విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఇంటిలో నిద్రిస్తున్న మహిళతో పాటు ఆమె ఇద్దరు చిన్నారి కూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. రాత్రి 3 గంటల సమయంలో పట్టణంలోని మేదరబస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్న గిరిధర్ కుటుంబంలో అతడు మినహా మిగిలిన ముగ్గురు సభ్యులు విగత జీవులుగా మారారు. శిథిలావస్థకు చేరుకున్న ఇంటిలో నివాసం ఉంటున్న గిరిధర్ కుటుంబం రోజూలానే నిన్న రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అయితే తెల్లవారకముందే గిరిధర్ కు తీరని శోకం మిగిలింది. ఇంటి పైకప్పు కూలడంతో శిథిలాల కింద నలిగిపోయిన గిరిధర్ భార్య సుధారాణితో పాటు పిల్లలు భార్గవి(9), కీర్తన(8)లు మృత్యువాత పడ్డారు. ఘటనలో గాయాలతో బయటపడ్డ గిరిధర్, తానెందుకు బతికానంటూ రోధించడం అక్కడి వారిని కలచివేసింది.