: ఐబీఎంలో వేలాది మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం!
ప్రముఖ సాప్ట్వేర్ సంస్థ ఐబీఎం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇండియాలోని వివిధ నగరాల్లో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. పెరుగుతున్న మార్జిన్ ఒత్తిళ్లను తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల పనితీరు ప్రాతిపదికన తొలగింపు జాబితా తయారవుతున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐబీఎంలో సుమారు 3,98,455 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఔట్‌సోర్సింగ్, కన్సల్టింగ్ సర్వీసులు సహా అన్ని విభాగాల్లోను ఈ తొలగింపులు ఉండవచ్చని సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా, ఐబీఎం ప్రతినిధి ఒకరు ఉద్యోగుల తొలగింపు వార్తలను కొట్టిపారేశారు. కంపెనీ ఖర్చులను తగ్గించి ఉత్పత్తులను పెంచేందుకు ప్రణాళికలు చేస్తోందని మాత్రం ఆయన వివరించారు.