: పాకిస్థాన్ లో టీచర్లకు ఆయుధ శిక్షణ... పెషావర్ ఎఫెక్ట్!
పాకిస్థాన్ లోని వాయవ్య ప్రాంతంలో పని చేస్తున్న టీచర్లకు ఇప్పుడు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. పెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడిచేసి వందకుపైగా విద్యార్థులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో అక్కడి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా శిక్షణ ఇస్తున్నామని, టీచర్లు పాఠశాలకు ఆయుధాలు తెచ్చుకుంటామంటే అభ్యంతరం పెట్టబోమని ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ విద్యా శాఖ మంత్రి అతీఫ్ ఖాన్ పేర్కొన్నారు. ఇక, సమాచార శాఖ మంత్రి ముస్తాక్ ఘని మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహించే ప్రతి పాఠశాలకు సాయుధ పోలీసులను రక్షణగా నియమించలేమని, అందుకే టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అధికార వర్గాలు కిందటి వారమే టీచర్లకు తుపాకీ వినియోగంపై శిక్షణ ఇచ్చాయి.