: 5 రూపాయలకి అబ్బాయిని అమ్మకానికి పెట్టి వివాదం రేపిన 'క్వికర్'
ఇంట్లోని పాత వస్తువులు అమ్ముకునేందుకు ఆన్ లైన్ లో రకరకాల వెబ్ సైట్లు సేవలందిస్తున్నాయి. వస్తువులను అమ్ముకునేందుకు ఉద్దేశించిన వెబ్ సైట్ 'క్వికర్' సంచలన వివాదం రేపింది. క్వికర్ కేవలం ఐదు రూపాయలకే ఓ పిల్లాడిని అమ్మకానికి పెట్టింది. ఇలా పిల్లాడిని అమ్మకానికి పెట్టిన ఘనత క్వికర్ దక్కించుకుంది. 'రాహుల్ ఫర్ సేల్' అనే శీర్షికతో గతేడాది డిసెంబర్ లో 5 రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లున్న ప్రకటన తీవ్రదుమారం రేపింది. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ తీవ్రంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వివాదం కావడంతో క్వికర్ ఆ యాడ్ ను వెబ్ సైట్ నుంచి తొలగించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాధికారి మాట్లాడుతూ, అలాంటి ప్రకటన ఎందుకు వచ్చిందనే విషయాన్ని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రకటనను చెన్నైకి చెందిన వ్యక్తి ఇచ్చినట్లు క్వికర్ పేర్కొంది.