: ధోనీ సేన వరల్డ్ కప్ అవకాశాలపై ఓ బ్యాంకర్ విశ్లేషణ
వరల్డ్ కప్ సమీపిస్తోంది. వచ్చే నెల 14న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికులకు నెలరోజులకు పైగా మజాను అందించడం ఖాయం. కాగా, ఎప్పుడూ ఆర్థిక పరమైన చర్చల్లో మునిగితేలే ప్రముఖ బ్యాంకర్, డాట్షూ బ్యాంక్ సీఈవో అన్షుజైన్ వరల్డ్ కప్ పై తన అభిప్రాయాలు వెల్లడించారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన ఆయన టోర్నీలో ధోనీ సేన అవకాశాలను విశ్లేషించారు. టైటిల్ నెగ్గే అవకాశాలున్న మూడు దేశాల్లో టీమిండియా ఒకటని బుకీలు భావిస్తుండగా, భారత్ పై అతిగా అంచనాలు పెట్టుకుంటున్నారని జైన్ అంటున్నారు. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీ కాబట్టి ఆస్ట్రేలియాకే కప్ నెగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పైగా, ఆసీస్ జట్టు బలంగా ఉందని కూడా తెలిపారు. న్యూజిలాండ్ కు కూడా అవకాశాలు లేకపోలేదని చెప్పారు. ఇక, వరల్డ్ కప్ మ్యాచ్ లు వీక్షిస్తారా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ... తనకంత సమయంలేదని, బ్యాంకు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉందని అన్నారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ, మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నప్పుడు వారికి ప్రాక్టీసు ఉండేలా చూడాలని సూచించారు. ఓపెనర్ విజయ్ ని వరల్డ్ కప్ కు ఎంపిక చేయాల్సిందని జైన్ అభిప్రాయపడ్డారు. వరుసగా విఫలమవుతున్న ధావన్ పైనా ఈ ఆర్థికవేత్త నమ్మకముంచారు. అయితే, అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో ఐదు గానీ, ఆరో స్థానంలో గానీ పంపాలని అన్నారు. భారత బ్యాటింగ్ అంతా కోహ్లీ చుట్టూనే పరిభ్రమిస్తోందని, అతనిపై అతిగా ఆధారపడాల్సివస్తోందని విశ్లేషించారు.