: ఎంఎస్ నారాయణకు పలువురు సినీనటుల ట్వీట్లు
ప్రముఖ సినీ నటుడు ఎంఎస్ నారాయణ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు సీనీనటులు ట్వీట్ల ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు. "ఎంఎస్ నారాయణ చాలా మంచి వ్యక్తి. ఉన్నత స్వభావం కలవారు. అలాంటి నటుడిని తిరిగి పొందడం కష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ సమంత ట్వీట్ చేశారు. "ఎంఎస్ గారు బహుముఖ ప్రజ్ఞాశీలి. దయా హృదయం కలవారు. లక్షలాది మంది అభిమానులకు ఆయన మృతి తీరని లోటే" అంటూ హీరో సిద్ధార్థ్ స్పందించారు. "ఎంఎస్ నారాయణ గారు లేరనే వార్త వినగానే షాక్ కు గురయ్యా. ఆయనతో కలసి రెండు సినిమాల్లో నటించా. ఈ సమయంలో ఆయన కుటుంబానికి బాసటగా నిలుద్దాం" అంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. "మిమ్మల్ని కోల్పోవడం బాధాకరం. మీతో కలసి పనిచేయడాన్ని ఎన్నటికీ మర్చిపోలేను" అంటూ హీరో వరుణ్ తేజ్ తెలిపాడు. "మమ్మల్ని ఇలా వదిలిపోవడం చాలా దారుణం సర్. మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీ ఆత్మకు శాంతి కలగాలి" అంటూ సుశాంత్ ట్వీట్ చేశాడు.