: డిప్యూటీ సీఎంపై కేసీఆర్ గరంగరం... ఊస్టింగ్ తప్పదంటూ వార్తా కథనాలు!


తెలంగాణ ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న రాజయ్య అవినీతి వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని, రాజయ్యను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని వదంతులు జోరందుకున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో భారీ ఎత్తున అవినీతికి తెరతీసిన రాజయ్య, ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్నట్లు లేదన్న కథనాలు కూడా వెలువడ్డాయి. నిన్నటికి నిన్న హైదరాబాదులోనే ఉన్నా, తన శాఖలో జరుగుతున్న పలు కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం ఈ వదంతులకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ఓ వైపు స్వైన్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తూ ఉంటే, రాజయ్య మాత్రం తన అవినీతి తంతులో నిండా మునిగిపోయి, అసలు పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. విషయం తెలుసుకున్న రాజయ్య నిన్న సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యి వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయన కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతోనూ భేటీలు నిర్వహించారు. తన కార్యాలయంలో ఓఎస్డీగా నియమించుకున్న ఓ అధికారి సహాయంతో రాజయ్య వసూళ్ల దందాకు తెరతీశారని కూడా సీఎం విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. ఈ తంతు ద్వారా కీలక పోస్టుల్లో నియమితులైన ముగ్గురు అధికారులపై సర్కారు నిన్న వేటు వేసింది. రాజయ్య తొలగింపు విషయంపై లోతుగా చర్చించిన సీఎం పలువురు కీలక నేతల అభిప్రాయం కోరారట. ఇందులో భాగంగా ఈసారికి వదిలేద్దాం, తీరు మార్చుకోకపోతే చర్యలు తీసుకుందామని కొందరు చెప్పారట. మరికొందరు మాత్రం చర్యల పట్ల ఇప్పటికే ఆలస్యం చేశామని వాదించారట. దాదాపు సీఎం కేసీఆర్ కూడా ఇదే భావనతోనే ఉన్నారట. ఈ నేపథ్యంలో రాజయ్యకు ఊస్టింగ్ తప్పదన్న వాదనకు బలం చేకూరుతోంది.

  • Loading...

More Telugu News