: 2,500 మందికి సల్మాన్ ‘ఉగ్ర’ పాఠాలు... కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
'ఐఎస్ఐఎస్'లో చేరేందుకు బయలుదేరి పోలీసులకు పట్టుబడ్డ సల్మాన్ మోయినుద్దీన్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని హైదరాబాదు పోలీసులు వెలికితీశారు. అరెస్టు తర్వాత కోర్టు అనుమతితో అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, నేటి నుంచి మరిన్ని వివరాలు వెలికితీయనున్నారు. ఇప్పటిదాకా పోలీసులు సేకరించిన వివరాల మేరకు... ఉగ్రవాద కార్యకలాపాల దిశగా సల్మాన్ సుదీర్ఘ ప్రయాణమే చేసినట్లు రుజువైంది. అమెరికా, హైదరాబాదుల్లో ఉండగానే సిరియాలోని ఐఎస్ కీలక నేతలతో సంబంధాలు నెరిపిన సల్మాన్, వారి వద్దకెళ్లి కఠోర శిక్షణను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శిక్షణ తర్వాత అతడు భారత్ లో జిహాద్ ను ప్రారంభించేందుకు కూడా పక్కాగా ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రేయసితో కలిసి మారుపేర్లతో ఫేస్ బుక్ లో ఖాతా ఓపెన్ చేసిన సల్మాన్, ఇప్పటిదాకా దాదాపు 2,500 యువకులకు ఉగ్రవాద పాఠాలు బోధించాడు. తాజాగా అతడి ఫేస్ బుక్ అకౌంట్ ను పోలీసులు నిలిపేశారు. నేటి నుంచి ప్రారంభం కానున్న విచారణలో భాగంగా పోలీసులు మరిన్ని కీలక వివరాలు రాబట్టనున్నారు.