: క్యాబ్ నడుపుతూ ఉద్యోగినిని వీడియో తీసిన డ్రైవర్... గుర్తించిన 'షీ' బృందం, నిర్భయ కేసు నమోదు
అతను ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ఉద్యోగులను ఇళ్లకు చేరవేసే క్యాబ్ డ్రైవర్. రోజు మాదిరిగానే సంస్థ నుంచి ఒక ఉద్యోగినిని ఇంటికి చేర్చేందుకు బయలుదేరాడు. ఆ యువతి నిద్రమత్తులో వుంటే వాడిలోని మృగం కళ్ళు తెరిచింది. ఆ యువతి (30)ని తన సెల్ ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు ఎంతమందిని అలా తీసాడో ఏమో? వాడి పాపం పండింది. క్యాబ్ నడుపుతూ ఆ డ్రైవర్ వీడియో తీస్తుండటాన్ని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ కూడలి వద్ద 'షీ' బృందం గమనించింది. దాదాపు రెండు కి.మీ.లపాటు డ్రైవర్ నిర్వాకాన్ని గమనిస్తూ వచ్చిన 'షీ' బృందం క్యాబ్ ను ఆపి డ్రైవర్ మొబైల్ ఫోన్ ను తనిఖీ చేయగా, ఏడు నిమిషాల నిడివి గల వీడియో, కొన్ని ఫోటోలు లభించాయి. క్యాబ్ డ్రైవర్ ను టోలీచౌకికి చెందిన ఎండీ అబ్దుల్ రషీద్ (28)గా గుర్తించి, నిర్భయ చట్టం కింద ఐపీసీ 354డి, సి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు 'షీ' బృందాల ఇన్‌ఛార్జి, మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి తెలిపారు.