: దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు అరెస్టు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందిన తారిక్ పర్వీన్ అనే వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్), లక్నో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో అతడు పట్టుబడ్డాడు. ముంబయిలో అతడిని అదుపులోకి తీసుకున్నారని ఓ అధికారి తెలిపారు. దీనిపై లక్నో సీనియర్ సూపరింటెండెంట్ యశస్వి యాదవ్ మాట్లాడుతూ, 1999లో మందుగుండు సామగ్రిని రవాణాచేసిన కేసులో పూణె నివాసి అయిన అజీజుద్దీన్, అఖీల్ అహ్మద్ లను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసిందని చెప్పారు. తరువాత పర్వీన్ పోలీసుల నుంచి తప్పించుకోవాలని చూశాడన్నారు. ముంబయి మాజీ మేయర్ ను చంపేందుకు నేపాల్ నుంచి ఆయుధాలను తీసుకొచ్చిన వారిలో ఇతనొకడని యాదవ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లక్నో పోలీసులు, ఏటీఎస్ బృందం ముంబయి వెళ్లి అతడిని అరెస్టు చేసినట్టు తెలిపారు.