: కిరణ్ బేడీజీ... బహిరంగ చర్చకు రండి : కేజ్రీవాల్ సవాల్
అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ... రెండేళ్ల క్రితం ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఒకే వేదికపై కూర్చుని లోక్ పాల్ కోసం నినదించారు. తాజాగా మరోమారు ఒకే వేదికపై కనిపిద్దామంటూ కేజ్రీవాల్, కిరణ్ బేడీకి ఆహ్వానం పలికారు. మరి కిరణ్ బేడీ అంగీకరిస్తే, ఇప్పుడు మనం వారిద్దరినీ ఒకే వేదికపై చూడొచ్చు. అయితే మిత్రులుగా కాదు, ప్రత్యర్థులుగా! నిన్నటిదాకా మిత్రులుగా ఉన్న వీరు ఢిల్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. రెండు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగానూ బరిలోకి దిగారు. ఆప్ సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్, బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీలు ఢిల్లీ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు రావాలంటూ కేజ్రీవాల్, కిరణ్ బేడీకి సవాల్ విసిరారు. తటస్థ మధ్యవర్తి సమక్షంలో జరిగే ఈ చర్చను ప్రజలందరూ చూసేలా ఏర్పాటు చేద్దామంటూ ఆయన నేటి ఉదయం బీజేపీకి సవాల్ విసిరారు. ఇక ఢిల్లీలోని కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ, కేజ్రీవాల్ సవాల్ కు ఎలా స్పందిస్తారో చూడాలి.