: పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణ: డిప్యూటీ సీఎం రాజయ్య
తెలంగాణను పోలియో రహిత రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలంగాణను పోలియో రహిత రాష్ట్రంగా ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రాజయ్య, రాష్ట్రంలో నిన్న 40 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామన్నారు. పోలియో చుక్కల కారణంగా వరంగల్ లో మరణించిన చిన్నారి ఘటనపై విచారణకు అదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో శీతాకాలంలోనే స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని చెప్పిన ఆయన, ఇప్పటిదాకా ఈ వ్యాధి కారణంగా ఐదుగురు మృతి చెందారని తెలిపారు. వ్యాధి సోకిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడిన 141 మందికి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.