: అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాతే వీహెచ్ పీ ఆవిర్భావ దినోత్సవం: ప్రవీణ్ తొగాడియా
అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాతే విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని ఆ సంస్థ చీఫ్ ప్రవీణ్ భాయ్ తొగాడియా స్పష్టం చేశారు. ‘‘రాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాతే మా సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తాం’’ అని ఢిల్లీలోని సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఎలాగైనా హిందువులు రామ మందిరం నిర్మిస్తారు. రామ మందిర నిర్మాణం పూర్తైన తర్వాతే వీహెచ్ పీ ఆవిర్భావం జరుపుకుంటాం. పాతికేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు ఇళ్లు వదిలి వెళ్లారు. నాలుగు లక్షల కాశ్మీరీ పండిట్లకు పునరావాసం కల్పించిన తర్వాతే ఆవిర్భావం’’ అని కూడా ఆయన అన్నారు. ‘‘ఆగ్రా మత మార్పిడులపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు దీనిని మత మార్పిడి అంటుంటే, మరికొందరు ఘర్ వాపసీ అంటున్నారు. మత మార్పిడులకు మేం వ్యతిరేకం. ఎందుకంటే, మత మార్పిడులు రాజ్యాంగానికి విరుద్ధం కదా?’’ అని తొగాడియా వ్యాఖ్యానించారు.