: ఉత్తమ ఎన్నికల అధికారిగా భన్వర్ లాల్: ఈసీ ప్రకటన
తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్... ఉత్తమ ఎన్నికల అధికారిగా గుర్తింపు పొందారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం భన్వర్ లాల్ కు అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలతో పాటు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన భన్వర్ లాల్ ఈసీ నుంచి ప్రశంసలందుకున్నారు. అంతేకాక ఇరు రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి భన్వర్ లాల్ మెరుగైన చర్యలు చేపట్టారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా భన్వర్ లాల్ అవార్డును అందుకోనున్నారు. ఎన్నికల్లో భన్వర్ లాల్ నిక్కచ్చిగా వ్యవహరించడంతో తెలుగు రాష్ట్రాల్లో 5 లక్షల లీటర్ల మద్యం, రూ.100 కోట్ల నగదు, 70 కేజీల బంగారం, 290 కేజీల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.