: యువత కలలను సాకారం చేసి తీరతాం: విశాఖలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
దేశ యువత కలలను సాకారం చేస్తామని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ స్మృతి ఇరానీ అన్నారు. యువత కలలను సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆమె అన్నారు. విశాఖ ఐఐఎం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆమె, యువతకు ఇచ్చిన హామీ మేరకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఐఐఎం బిల్లుకు ఆమోద ముద్ర పడేలా కృషి చేస్తామని ప్రకటించారు. దేశంలో నూతన విద్యా విధానాలను ప్రవేశపెడతామని మంత్రి అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి విద్య అందేలా చర్యలు చేపడతామన్నారు. విశాఖ నగరం స్థితిగతులను ప్రస్తావించిన ఆమె, సుందరమైన నగరానికి హుదూద్ భారీ నష్టాన్ని మిగిల్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఐటీ పట్ల విశేష అనుభవంతో పాటు ఐటీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందని ఆమె పేర్కొన్నారు.