: చేతులు కలపనున్న బీజేపీ, తృణమూల్!
పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంలో పెను మార్పు రానుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదైనా సంభవమే అనిపిస్తోంది. రాజకీయ నిపుణులు సైతం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల బంధంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాజ్యసభలో కొన్ని చట్టాలను ఎలాగైనా ఆమోదింపచేసుకోవాలన్న ఆలోచనతో ఈ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి ఆరోపించారు. ఇటీవల కోల్ కతాలో జరిగిన 'బెంగాల్ గ్లోబల్' సదస్సుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, తృణమూల్ సహకారం లేకుండా రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదం కష్టమన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ ఆ మేరకు 'స్నేహ హస్తం' అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు శారదా స్కాం నుంచి గట్టెక్కేందుకు తృణమూల్ కు సైతం కేంద్ర ప్రభుత్వ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ పార్టీ అధినేత్రి మమత బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.