: ఏపీ ఎస్ఆర్టీసీ విభజనపై నేడు కేంద్రం చర్చలు... నితిన్ గడ్కరీతో ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీ ఎస్ఆర్టీసీ) విభజనపై నేడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక చర్చలు జరపనున్నారు. ఈ చర్చలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మలు హాజరుకానున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పాలన కొనసాగుతుండగా, ఆర్టీసీ సేవలు మాత్రం రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఆర్టీసీ విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగిన దాఖలా లేదు. అంతేకాక రెండు రాష్ట్రాలకు చెందిన కార్మికులకు సంబంధించిన వేతనాలు, పండుగ అడ్వాన్సుల పేరిట రెండు ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తున్నాయి. సంస్థ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ సేవల కోసం వేర్వేరు విభాగాలు రంగంలోకి దిగనున్నాయి.