: నరేంద్ర మోదీ పనితీరుకు ఆకర్షితురాలినయ్యా... త్వరలోనే బీజేపీలో చేరతా: జయప్రద
‘‘ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల ఆకర్షితురాలినయ్యా. అందుకే త్వరలో బీజేపీలో చేరుతున్నా’’ అని ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత జయప్రద అన్నారు. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన ఆమె, బీజేపీలో చేరుతున్న విషయాన్ని ధ్రువీకరించారు. సమాజ్ వాదీ పార్టీలో ఉండగా, ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తో పాటు పార్టీ నేత, యూపీ మంత్రి అజాంఖాన్ తనను వేధింపులకు గురి చేశారని సంచలన ప్రకటన చేసిన ఆమె, ఆ కారణంగానే అమర్ సింగ్ తో కలిసి సమాజ్ వాదీ పార్టీకి రాజీనామా చేశామని వెల్లడించారు. త్వరలో బీజేపీలో చేరి సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని జయప్రద ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే శిరసావహిస్తానని ఆమె తెలిపారు. కేజ్రీవాల్ పై పోటీకి అవకాశం చిక్కితే తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని కూడా జయప్రద తెలిపారు.