: రోహిత్ శర్మ దెబ్బకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్!
సొంతగడ్డపై ఆఖరి టెస్టు ఆడేశానని, ఇంగ్లండ్ వెళ్లి యాషెస్ ఆడాలనే కల నెరవేర్చుకొని ఆటకు గుడ్ బై చెబుతానని ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ రోజర్స్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రోజర్స్ తీసుకున్న నిర్ణయం వెనుకవున్న కారణం ఏంటో తెలుసా?.. అదేంటో రోజర్స్ స్వయంగా వెల్లడిస్తూ, "బ్రిస్బేన్‌లో భారత్‌తో రెండో టెస్టు ఆడుతున్నప్పుడు తొలి రోజు రోహిత్ శర్మ స్వీప్ షాట్ ఆడాడు. అప్పుడు నేను ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాను. బంతి రాగానే తల వెనక్కి తిప్పాను. అది వచ్చి హెల్మెట్ మీదే మెడ భాగంలో తగిలింది. సరిగ్గా హ్యూస్ కు బంతి తగిలిన ప్రదేశం కూడా అదే. ఒక్క క్షణం షాక్ కు గురయ్యాను. అయితే అదృష్టవశాత్తు నాకు ఏం కాలేదు. ఆ రోజు రాత్రి చాలాసేపు ఆలోచించాను. 37 ఏళ్ల నేను ఇంకా ఎంతకాలం క్రికెట్ ఆడగలనో తెలియదు. యాషెస్ ఆడాలనే కల మిగిలున్నందున ఇంగ్లండ్ వెళ్లి ఆ టోర్నీ ఆడాలి. ఈలోగా స్వదేశంలో టెస్టులు లేవు కాబట్టి సొంతగడ్డపై ఆఖరి మ్యాచ్ అని ప్రకటించాను" అని తెలిపాడు. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు చాలా మంది సన్నిహితులతో మాట్లాడినట్టు ఆయన వివరించాడు.