: అన్ని వేళ్లూ థరూర్ వైపే చూపిస్తున్నాయి?
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ చుట్టూ ముడి బిగుసుకుంటోందా? అతని భార్య దివంగత సునంద పుష్కర్ మృతితో అతడికి సంబంధం ఉందా? అంటే పోలీసుల వ్యాఖ్యలు, సునంద పుష్కర్ సన్నిహితులు, థరూర్ ఇంటి పనిమనుషుల వాంగ్మూలం వంటివన్నీ థరూర్ ను దోషిగా చూపిస్తున్నాయి. వీటన్నింటినీ మించి థరూర్ వివాహేతర సంబంధాలు కూడా ఆమె హత్యలో ప్రముఖ పోషించినట్టు తెలుస్తోంది. సునంద పుష్కర్, శశి థరూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత కొన్ని రోజులకు థరూర్ గురించిన వాస్తవాలు తెలియడంతో సునంద పుష్కర్ లో కలత మొదలైంది. దీంతో ఆమె ఆందోళన చెందేవారని ప్రముఖ జర్నలిస్టు నళినీ సింగ్, సునంద పుష్కర్ మృతిచెందిన మూడు రోజులకే వెల్లడించిన సంగతి తెలిసిందే. శశి థరూర్, పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్ మధ్య బంధం గురించి సునంద తనతో చర్చించినట్టు ఆమె తెలిపారు. 2013 జూన్ లో థరూర్, తరార్ కలసి దుబాయ్ లో మూడు రాత్రులు గడిపినట్టు తనవద్ద ఆధారాలు ఉన్నాయని సునంద చెప్పినట్టు నళిని వెల్లడించారు. కీలకమైన సమాచారాన్ని థరూర్ తన బ్లాక్ బెర్రీ మొబైల్ నుంచి డిలీట్ చేశారని, వాటిని తిరిగి పొందేందుకు సహాయం చేయాలని నళినిని సునంద కోరినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారి పనిమనిషి పోలీసులకు కీలక సమాచారం వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో థరూర్ ఎలా సహకరిస్తారనేది చూసిన తరువాతే స్పందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో థరూర్ పోలీసులకు సహకరిస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.