: నేతాజీని చంపించింది స్టాలినే: సుబ్రమణ్యస్వామి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను చంపించింది అప్పటి సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్ అని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అంటున్నారు. కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై సమగ్ర నివేదిక ఉన్న ఫైళ్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సైబీరియాలోని రహస్య ప్రాంతంలో నేతాజీని స్టాలిన్ చంపించారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫైళ్లను బయటపెడితే బ్రిటన్, రష్యాతో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను ప్రధాని మోదీతో చర్చిస్తానని ఆయన వెల్లడించారు. నేతాజీ మరణశిక్ష నుంచి తప్పించుకుని మంచూరియాలోని ఓ ప్రాంతంలో దాక్కున్నట్టు వాదనలు ఉన్నాయని తెలిపిన ఆయన, వాస్తవానికి నేతాజీని స్టాలిన్ సైబీరియాలోని ఓ జైలులో పెట్టారని అన్నారు. 1953 ప్రాంతంలో నేతాజీని ఉరితీయడమో, లేక, ఊపిరాడకుండా చేసి చంపడమో చేసి ఉంటారని పేర్కొన్నారు.