: రఫెల్ నడాల్ కు షాకిచ్చిన అనామకుడు


ఇటీవలే గాయాల నుంచి కోలుకుని బరిలో దిగిన మాజీ వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నడాల్ ఓ అనామకుడి చేతిలో దారుణ పరాభవం చవిచూశాడు. దోహాలో జరుగుతున్న ఏటీపీ వరల్డ్ టూర్ లో నడాల్ 6-1, 3-6, 4-6తో మైకేల్ బెర్రర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 34 ఏళ్ల బెర్రర్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 127వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను తనదైన శైలిలో చేజిక్కించుకున్న నడాల్ ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు కోల్పోయాడు. కెరీర్ చరమాంకంలో ఉన్న జర్మనీ క్రీడాకారుడు బెర్రర్ ఈ మ్యాచ్ లో నడాల్ ను బెంబేలెత్తించాడు. భారీ సర్వీసులు, పిడుగుల్లాంటి బ్యాక్ హ్యాండ్ షాట్లతో 'స్పెయిన్ బుల్' ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కీలక దశల్లో చేసిన తప్పిదాలు కూడా నడాల్ ఓటమికి కారణమయ్యాయి. ఈ పరాజయంపై నడాల్ స్పందిస్తూ, మ్యాచ్ లో ఏదీ అనుకూలించలేదని అన్నాడు. ఇక, దిగ్గజ క్రీడాకారుడిపై నెగ్గిన బెర్రర్ మాట్లాడుతూ, నిజాయతీగా చెప్పుకోవాలంటే గాయాల నుంచి కోలుకున్న తర్వాత నడాల్ కు ఇదే తొలి మ్యాచ్ అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News