: చేరికల్లేవ్... పార్టీ కార్యక్రమాలకే పరిమితం: నేడు హైదరాబాద్ కు అమిత్ షా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. నేటి రాత్రి 9 గంటల సమయంలో హైదరాబాద్ చేరుకోనున్న ఆయన రేపు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో బీజేపీలోకి భారీ చేరికలుంటాయన్న వార్తలను ఆ పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కానున్న అమిత్ షా, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పటిష్ఠతపై మాత్రమే దృష్టి సారిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీల నుంచి పలువురు నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగానే ఉన్నా, ఈ దఫా అమిత్ షా పర్యటనలో ఎలాంటి చేరికలు ఉండబోవని తెలుస్తోంది. అయితే ఇరు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ సమీకరణాలపై అమిత్ షా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.