: జర్నలిస్టులపై అగ్రిగోల్డ్ గూండాల దాడి... చోద్యం చూసిన పోలీసులు
మదుపరులను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యం, జరిగిన మోసాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపైకి గూండాలను ఉసిగొల్పింది. అధిక వడ్డీల పేరిట కోట్లాది రూపాయల డిపాజిట్లను సేకరించి లక్షలాది మంది సామాన్యులను ముంచేసిన అగ్రిగోల్డ్ పై ఫిర్యాదుల వెల్లువ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు సంస్థ యజమానులు రామారావు, కుమార్ ఇళ్లల్లో ఏలూరు సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలో మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై అగ్రిగోల్డ్ గూండాలు దాడికి దిగారు. రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అయితే ఈ తతంగాన్ని కళ్లారా చూసిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. అంతటితో ఆగని పోలీసులు అగ్రిగోల్డ్ గూండాలను వదిలేసి జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు డీజీపీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన బెజవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.