: బీజేపీకి మూడు షరతులు విధించిన పీడీపీ... వచ్చే వారం తేలిపోనున్న పొత్తు
జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏ పార్టీ వల్ల కాదని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. బీజేపీతో చేయి కలిపేందుకు పీడీపీ నాయకత్వం సిద్ధమైనా పార్టీ నేతలు కొంత మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీడీపీ అధినాయకత్వం, నేతల మధ్య రెండు వారాల నుంచి చర్చోపచర్చలు కొనసాగాయి. చివరకు, వచ్చే వారం బీజేపీ నేతలతో సమావేశం కావాలని పీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి రెండు పార్టీల నుంచి కీలక నేతలు హాజరవుతారు. రానున్న మంగళవారం ఈ సమావేశం జరగవచ్చని అంచనా. బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు అభ్యంతరం లేదని... అయితే, కొన్ని కండిషన్లకు బీజేపీ ఒప్పుకోవాలని పీడీపీ షరతు విధించింది. ఈ షరతుల విషయంలోనే బీజేపీ కాస్త వెనక్కు తగ్గుతోంది. ఆ షరతుల్లో మొదటి అంశం ఏమిటంటే... జమ్మూ కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పాకిస్థాన్ తో చర్చలు జరపాలి. రెండోది... భద్రతా బలగాలకు కల్పిస్తున్న ప్రత్యేక అధికారాలను రద్దు చేయడం. మూడోది... వేర్పాటువాదులతో చర్చలు జరపడం. ఈ షరతులపై ఇంతవరకు బీజేపీ మౌనముద్రనే దాల్చింది. పీడీపీ షరతుల్లో మొదటిదాన్ని చాలా క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే, పాక్ తో చర్చలు అనే విషయం ద్వైపాక్షిక సంబంధాలు, విదేశాంగ వ్యవహారాల పరిధిలోకి వస్తుంది. ఒక ప్రాంతీయ పార్టీ సూచనల మేరకు విదేశాంగ నిర్ణయాలు తీసుకోవడం జరగని పని. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో మరో మూడు, నాలుగు రోజుల్లో ఇరు పార్టీల మధ్య చర్చలు జరగనున్నాయి. ఏదో ఒక పార్టీ తగ్గితే, ప్రభుత్వం ఏర్పడుతుంది. లేదంటే జనవరి 19వ తేదీ తర్వాత రాష్ట్రపతి పాలన తప్పదు.