: కేంద్రం తీరుపై సైనా అసంతృప్తి
ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిరాశకు గురైంది. పద్మ భూషణ్ అవార్డు కోసం సైనా దాఖలు చేసిన దరఖాస్తును ప్రమాణాలను సాకుగా చూపుతూ కేంద్రం తిరస్కరించింది. భారత బ్యాడ్మింటన్ సంఘం గత ఏడాది ఆగస్టులో ఆమె పేరును క్రీడల మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. అయితే, కేంద్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఎంపిక చేసింది. సుశీల్ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడని భావించింది. దీనిపై సైనా స్పందిస్తూ, "ప్రత్యేకమైన కేసుగా పరిగణించి సుశీల్ కుమార్ పేరును ఈ అవార్డుకు ప్రతిపాదించారు. అయితే, క్రీడల మంత్రిత్వ శాఖ నా పేరును మాత్రం హోం శాఖకు పంపలేదు. మంత్రిత్వ శాఖ నిబంధనలు 'పద్మ' అవార్డులకు మధ్య ఎడం ఐదేళ్లు ఉండాలని సూచిస్తున్నాయి. అలాంటప్పుడు అతని పేరు పంపిన వాళ్లు, నా పేరును ఎందుకు రికమెండ్ చేయలేదు? నేను పద్మశ్రీ అందుకుని ఐదేళ్లయింది. పద్మ భూషణ్ అందుకునేందుకు ఆ విధంగా నేను అర్హురాలినే. దీనిపై ఎంతో అసంతృప్తికి లోనయ్యా" అని ఆవేదన వ్యక్తం చేసింది. సైనా 2010లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. కాగా, కిందటేడాది కూడా తనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని సైనా వాపోయింది.