: వాజ్ పేయి, పీవీల భారతరత్నలకు మన్మోహన్ అంగీకరించారు: సంజయ బారు
మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావులకు భారతరత్నలను ప్రకటించేందుకు తాజా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దాదాపుగా అంగీకరించారని అప్పటి ఆయన మీడియా సలహాదారు సంజయ బారు అన్నారు. అయితే యూపీఏ సర్కారు అందుకు తన సమ్మతి తెలపలేదని ఆయన వెల్లడించారు. నాటి మన్మోహన్ ప్రతిపాదన నేటికీ వెలుగుచూడలేదని బారు అన్నారు. మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా కొనసాగిన నాటి స్మృతులను గుర్తు చేసుకున్న సందర్భంగా సంజయ బారు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అటల్ జీతో పాటు పీవీకి కూడా భారతరత్న తీసుకునేందుకు అర్హత ఉందని సూచించాను. నా ప్రతిపాదనకు మన్మోహన్ కూడా అంగీకరించారు. అయితే ఎందుకనో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆ ప్రతిపాదనను కొట్టేశారేమో నాకు తెలియదు’’ అంటూ సంజయ బారు అన్నారు.