: ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
దేశ రాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఐబీ, రా అధికారులు భగ్నం చేశారు. నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసర్చ్ అండ్ అనలైజింగ్ వింగ్ (రా) అధికారులు వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా, దేశంలోని పలు నగరాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం. అంతేకాకుండా, ఢిల్లీలో మరో 10 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని తెలియడంలో... వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పట్టుబడిన ఉగ్రవాదుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.