: 'బ్లాక్ బాక్స్' కోసం కొనసాగుతున్న గాలింపు
ఎయిర్ఏషియా విమానం కూలిపోయి రోజులు గడుస్తున్నా, విమానం ఆచూకీ కానీ, 'బ్లాక్ బాక్స్' జాడ కానీ తెలియరాలేదు. నీటిపై తేలియాడతున్న కొన్ని మృతదేహాలను మాత్రం తీరానికి చేర్చగలిగారు. జావా సముద్రంలో విమానం కూలిపోయిందని భావిస్తున్న ప్రాంతంలో వాతావరణం గాలింపు చర్యలకు పలుమార్లు అంతరాయం కలిగించింది. గురువారం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉండగా, సముద్రం కూడా ప్రశాంతంగా ఉంది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తం చేసుకున్న 'బ్లాక్ బాక్స్' కోసం అన్వేషణ మొదలైంది. ఈ గాలింపు చర్యల్లో ఇండోనేషియా బృందాలకు తోడు అంతర్జాతీయ నిపుణులు కూడా పాలుపంచుకుంటున్నారు. అనుకూల వాతావరణం కారణంగా నేటి గాలింపులో 'బ్లాక్ బాక్స్' లభ్యమవుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అటు, మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.