: మెల్ బోర్న్ టెస్టు డ్రా... సిరీస్ ఆసీస్ కైవసం


నాలుగు టెస్టుల సిరీస్ లో మూడోదైన మెల్ బోర్న్ టెస్టు డ్రాగా ముగిసింది. ఆసీస్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి ఓటమి తప్పించుకుంది. అయితే, తొలి రెండు టెస్టులు నెగ్గి 2-0 ఆధిక్యం సంపాదించిన కంగారూలు మెల్ బోర్న్ టెస్టుతో సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గి ఉంటే, సిరీస్ పోరు చివరి టెస్టు వరకు కొనసాగేది. కానీ, మెల్ బోర్న్ టెస్టు డ్రా కావడంతో చివరి టెస్టు అప్రాధాన్యంగా మారింది. అంతకుముందు, ఐదో రోజు ఆటలో ఓవర్ నైట్ స్కోరు 261/7 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 318/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో, భారత్ ముందు 384 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. భారత బౌలర్లలో షమీ, యాదవ్, ఇషాంత్, అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే హ్యారిస్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన కొత్త కుర్రాడు రాహుల్ (1) ను జాన్సన్ బలిగొనడంతో భారత్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ విజయ్ (11) కూడా విఫలమవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే, కోహ్లీ (54), రహానే (48) జోడీ నాలుగో వికెట్ కు 104 పరుగులు జోడించి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా, అది కాసేపే అయింది. కోహ్లీని హ్యారిస్ అవుట్ చేయగా, ఆ తర్వాత వచ్చిన పుజారా (21) నిలదొక్కుకున్నట్టే కనిపించాడు. అయితే, జాన్సన్ బంతి అతని బెయిల్స్ ను గిరాటేసింది. దీంతో, జట్టును ఆదుకునే భారం కెప్టెన్ ధోనీ, రహానేలపై పడింది. హాఫ్ సెంచరీకి చేరువలో రహానే కూడా అవుట్ కావడంతో భారత్ ఆరో వికెట్ చేజార్చుకుంది. అప్పటికి జట్టు స్కోరు 142 పరుగులు. ఆ తర్వాత డ్రాను దృష్టిలో పెట్టుకుని ధోనీ, అశ్విన్ ఆచితూచి ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు కంగారూలు విఫలయత్నాలు చేశారు. చివరికి ఫలితం తేలేలా కనిపించకపోవడంతో మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

  • Loading...

More Telugu News