: గాడ్సేకు గుడి కడితే చూస్తూ ఊరుకోం: ఉత్తరప్రదేశ్ జిల్లా మేజిస్ట్రేట్
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు ఆలయం నిర్మించేందుకు ప్రయత్నిస్తే జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఎల్బీ పాండే హెచ్చరించారు. నాథూరాం గాడ్సే పేరుతో ఎక్కడ ఆలయం నిర్మించినా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 2015 జనవరి 30న యూపీలోని సీతాపూర్ జిల్లాలోని పారా గ్రామంలో గాడ్సేకు గుడి కట్టనున్నట్టు కమలేష్ తివారి అనే వ్యక్తి గతంలో ప్రకటించారు. గాడ్సే గుడి కోసం తనకున్న భూమిలో కొంత దానం చేశానని కూడా ఆయన వెల్లడించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా మేజిస్ట్రేట్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో గాడ్సేను హీరోను చేస్తూ కొన్ని సంఘాలు విపరీత వ్యాఖ్యలు చేస్తున్నాయి. అలా చేస్తే హత్యలను ప్రోత్సహించినట్టవుతుందని, గాడ్సే భారత జాతిపితను హత్య చేసిన విషయాన్ని జాతి మరవకూడదని మేధావులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.