: పెళ్లి వాగ్దానం వీడినంత మాత్రాన అత్యాచారం అనలేం: బాంబే హైకోర్టు
పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసి, ఆపై పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని తదుపరి మనస్పర్థలతో అత్యాచారం అనడం సరికాదని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదులా భత్కల్ అభిప్రాయపడ్డారు. మారుతున్న నేటి తరంలో పెళ్లికి ముందు శృంగారం ఆశ్చర్యాన్ని కలిగించడం లేదని, సహజీవనాన్ని చట్టం గుర్తిస్తోందని చెప్పిన న్యాయమూర్తి, జంట మధ్య ప్రేమ ఇంకిపోయిన తరువాత అంతకుముందున్న సంబంధాన్ని అత్యాచారంగా పరగణించలేమన్నారు. ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు 2006 నుంచి సహజీవనం చేస్తూ ఉన్నారు. చివరకు అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి కావడంతో అతడు తనను మోసం చేశాడని, కొంతకాలం పాటు రేప్ చేశాడని 2013లో ఆమె కేసు పెట్టింది. అయితే తమ మధ్య పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం కొనసాగిందని అతడు కోర్టులో వాదించగా, అతడి వాదనలో బలముందని భావించిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.