: రాజధాని అగ్ని ప్రమాదాల వెనుక బాబు కుట్ర ఉందన్న వైకాపా... జగన్ చేయించాడన్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారథి, మేరుగ నాగార్జున నేడు ఆరోపించారు. ఈ అరాచకంపై సీబీఐతో విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉందని, పంటలు పండే భూములను ఇవ్వబోమని రైతులు ఎదురు తిరిగితే సర్కార్ రాక్షసంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఆ వెంటనే, ఏపీ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి, కడప ఫ్యాక్షన్ మాఫియా రాజధానిపై వచ్చి వాలిందని, అగ్ని ప్రమాదాల వెనుక వై.ఎస్.జగన్ హస్తం ఉందని ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. పొలాలకు నిప్పంటించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు సైతం ఇదే విధమైన ఆరోపణలు చేశారు. జగన్ నేర చరిత్ర అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు.