: నేడు కాంగ్రెస్ 130వ ఆవిర్భావ దినోత్సవం...బెజవాడలో యూత్ కాంగ్రెస్ సదస్సు
జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి 130 ఏళ్లు నిండాయి. స్వాతంత్ర్య సంగ్రామం నుంచి నేటి దాకా పలు విజయాలతో పాటు అపజయాలను కూడా మూటగట్టుకున్న ఆ పార్టీ ప్రస్తుతం అత్యంత దీనావస్థలో ఉంది. పార్టీకి సుదీర్ఘ కాలంగా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతుంటే, పార్టీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాడనుకుంటే, ఉన్న ప్రతిష్ఠను కూడా కాపాడలేకపోతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని నేడు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు ఏపీ పీసీసీ ఆధ్వర్యంలో నేడు విజయవాడలో యూత్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సహా కీలక నేతలు హాజరుకానున్నారు.