: నా కుటుంబం నేవీ హెలికాప్టర్లో ప్రయాణించిందనడం అవాస్తవం: జైట్లీ


తన భార్య, కుమార్తె గోవాలో భారత నావికాదళ హెలికాప్టర్ ను ఉపయోగించినట్టు వస్తున్న ఆరోపణలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. డిసెంబర్ 23న ఆర్థికమంత్రి భార్య, కుమార్తె నేవీ హెలికాప్టర్ లో ప్రయాణించారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ హెలికాప్టర్ ను సమకూర్చారని కూడా మీడియా పేర్కొంది. ఈ అంశంపై జైట్లీ ఫేస్ బుక్ లో స్పందిస్తూ, ఈ వార్త మూడు విధాలా అవాస్తవమని అన్నారు. మొదటిది, ఆ రోజున గోవాలో ఉన్నది తన భార్య, కుమారుడు అని వెల్లడించారు. తన కుమార్తె ఆ రోజు అక్కడలేదన్నారు. రెండోది, నేవీ హెలికాప్టర్ కాదు కదా, కనీసం ఏ ప్రభుత్వ వాహనాన్ని వారు వినియోగించలేదని తెలిపారు. ఇక మూడవది, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్ ను తమకు సమకూర్చలేదని, అది పూర్తిగా ప్రైవేటు పర్యటన అని, వారు గోవాలో ఉన్న విషయం పారికర్ కు ఏమాత్రం తెలియదని జైట్లీ వివరించారు.

  • Loading...

More Telugu News