: బెజవాడను క్రైం సిటీగా చిత్రీకరించారు: విజయవాడ ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్య
విజయవాడ నగరం స్థితిగతులు, నగరాభివృద్ధిలో ప్రభుత్వ పాత్రపై స్ధానిక ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నేరాల వృద్ధి అంతగా లేకున్నా, నగరాన్ని క్రైం సిటీగా చిత్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా, నగరంలో లేశమాత్రం అభివృద్ధి కూడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే ఈ దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేస్తున్నా, అధికారులు మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. నగర పోలీస్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు తీరుపై నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా లేని విధంగా పోలీసులు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ఆరోపించారు. నేరాలు అంతగా లేకున్నా నగరాన్ని క్రైం సిటీగా చిత్రీకరించారని ధ్వజమెత్తారు. నగరంలో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.