: జనవరి ఒకటి నుంచి వైద్యులకు ఔషధ కంపెనీల బహుమతులపై నిషేధం
ఇకపై వైద్యులకు ఔషధ కంపెనీలు బహుమతులు ఇచ్చే వీలుండదు. వైద్యులకు ఇచ్చే అనైతిక బహుమతులను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వైద్యుల సంఘాలు సొంతంగా కోడ్ ను ఏర్పాటు చేసుకొని బహుమతులకు దూరంగా ఉండాలని ప్రయత్నించినా, అది అమలు జరగకపోవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్టడీ టూర్ల పేరుతో వైద్యుల విదేశీ యాత్రలకు అయ్యే ఖర్చులు పెట్టడం, ఖరీదైన బహుమతులు ఇవ్వడం వంటి అనైతిక పద్ధతులు పెరుగుతున్నాయని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఆయా కంపెనీలు ఇచ్చే బహుమతులను బట్టి అవి మార్కెటింగ్ చేస్తున్న మందులను డాక్టర్లు ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే జనవరి ఒకటి నుంచి ప్రభుత్వపరంగా ఈ తరహా బహుమతులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరు నెలల తర్వాత అమలు స్థితిని సమీక్షించి ఆపై చట్ట సవరణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.