: ఎంసెట్ కు తెలంగాణ ప్రభుత్వం కలసి వస్తుందనుకుంటున్నాం: మంత్రి గంటా
ఎంసెట్ పరీక్ష విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమతో కలసివస్తుందని భావిస్తున్నట్టు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి దానిపై సానుకూలంగానే స్పందించారని తెలిపారు. కార్యదర్శుల స్థాయి సమావేశంలో మార్గదర్శకాలు రూపొందిస్తారన్నారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రితో సమావేశమై చర్చించాక ఎంసెట్ పై ఓ నిర్ణయానికొస్తామని గంటా పేర్కొన్నారు. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థులు నష్టపోకూడదని, వారు ఇబ్బంది పడకూడదనే తమ తపన అని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన గంటా, పదేళ్లు ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించాలన్నది తమ కోరికని తెలిపారు. సమస్యలొస్తే... వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వం కలసి రానందునే విడిగా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు.