: లఖ్వీకి బెయిల్ తీర్పుపై పాక్ ప్రభుత్వ అప్పీలులో జాప్యం
ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకి-ఉర్-రహమాన్ లఖ్వీకి బెయిల్ మంజూరు చేస్తూ పాకిస్థాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీలు చేయాల్సి ఉండగా, ఆ వ్యవహారంలో జాప్యం చోటుచేసుకుంది. తను చేయాల్సిన అప్పీలు దరఖాస్తు తప్పనిసరి పరిస్థితుల్లో ఆలస్యం చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది మహ్మద్ అజహర్ చౌదరి తెలిపారు. చట్టపరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసేందుకు అవసరమైన బెయిల్ తీర్పు కాపీ ఈ రోజు తనకు అందాల్సి ఉందని చెప్పారు. ఇంతవరకు తనకు తీర్పు కాపీ అందలేదని వెల్లడించారు. దాంతో, ఇవాళ కోర్టులో అప్పీలు చేయడంలేదన్నారు. ఏదేమైనా బెయిల్ తీర్పును పరిశీలించిన తరువాత సవాల్ చేస్తామని న్యాయవాది తెలిపారు.