: జులాయిల వేధింపులు ఇలా కూడా ఉండొచ్చు...!
జులాయి వేధింపులు భరించలేని ఓ వివాహిత హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా, వారు అతనిని కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బేగరి ప్రవీణ్‌కుమార్ (32) జులాయి. అదే ప్రాంతానికి చెందిన వివాహిత (30) తన కుమార్తెను పాఠశాలకు తీసుకువెళ్లి, తీసుకువచ్చే సమయంలో ప్రవీణ్ ఆమెను పరిచయం చేసుకుని రోజూ మాట్లాడేవాడు. తొందర్లోనే అతని వ్యవహార శైలి సరిగా లేదని గుర్తించిన ఆమె అతనితో మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ప్రవీణ్, ఓ కళాశాలలో చదువుకుంటున్న ఆమెకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తో వివాహేతర సంబంధం ఉందంటూ గోడలపై రాతలు రాశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె కళాశాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ అప్పట్లో పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పోలీసు విచారణలో నిందితుడ్ని గుర్తించలేకపోయారు. దీంతో తనను ఎవరు పట్టుకోలేరని భావించిన ప్రవీణ్ ఆమె సెల్ ఫోన్ నెంబర్ సులభ్ కాంప్లెక్స్ గోడలపై రాశాడు. దీంతో ఆమె నెంబర్ కు ఫోన్లు వెల్లువెత్తాయి. ఇంతటితో ఆగని ప్రవీణ్ ఆమె పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరచి అశ్లీల దృశ్యాలను అందులో పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె సెల్ కు అసభ్యకర ఎస్‌ఎంఎస్ లు పంపాడు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రవీణ్ ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.